"ఇదిగో బాణం విడిచిపెడుతున్నా! " శరాన్ని సంధించి జమదగ్ని మహాముని భార్య రేణుకాదేవి వైపు చూశాడు.
"ఊ"
"చాలా దూరం వెడుతుంది సుమా!"
"ఎంత దూరం వెళ్లినా తేగలను."
"అలాగేం? సరే! చూడు మరి."
జమదగ్ని బాణం విడిచాడు. రేణుకాదేవి పరుగెత్తింది.
ఒకరోజు వాళ్లిద్దరికి సరదాగా ఆటపాటలతో గడపాలని బుద్ధి పుట్టింది. అందుకే పొద్దున్నే బాణాలూ, విల్లూ తీసుకుని బయలుదేరారు. చాలా దూరం నడిచి ఒక ఆరుబయలు ప్రదేశం చేరుకున్నారు.
జమదగ్ని బాణాలు వేయడం, ఆమె పరుగెత్తి ఆ బాణం ఎక్కడ పడిందో కనుక్కుని తెచ్చి ఇవ్వడం .. ఇదీ ఆట.
ఆ ఆట ఇద్దరికీ నచ్చింది.. కాని జమదగ్నికి జాలేసింది తన భార్య కనుక్కోగలదో లేదో అని.
"ఇదిగో బాణం తెచ్చాను!" అని నవ్వుతూ అందించింది రేణుకాదేవి.
అలా జమదగ్ని బాణాలు వేస్తూనే ఉన్నాడు. ఆమె కనుక్కుని తెస్తూనే ఉంది. కాని ఒకసారి అలా వెళ్లిన రేణుకాదేవి ఎంతసేపటికీ తిరిగిరాలేదు. జమదగ్ని చాలాసెపు ఎదురు చూశాడు. చివరికి నీరసంగా , మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది.
"రేణుకా! ఏమైంది ఈసారి ఆలస్యం చేసావు?"
" అదిగో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కాళ్ళు బొబ్బలెక్కి ఆయాసంగా ఉంటే కాస్సేపు ఒక చెట్టు కింద కూర్చుని వస్తున్నాను."
అలిసిపోయి ముఖం మీది చెమటను చీరచెరుగుతో తుడుచుకుంటున్న రేణుకాదేవిని చూసి జమదగ్ని బాధపడి " ఈ సూర్యుడు నిన్ను ఇంతగా బాధపెట్టాడా? అతని పని చెప్తానుండు " అంటూ కోపంతో సూర్యుడివైపు అస్త్రం సంధించాడు.
ఇంతలో ఒక బ్రాహ్మణుడు గబగబా వచ్చి ఆయన చేతిని పట్టుకున్నాడు.
"మహర్షీ! శాంతించు. సూర్యుడు లేకుండా ముల్లోకాలు నిలుస్తాయా? ఆలోచించు."
"నాకు అదంతా తెలీదు. సూర్యుడు నా భార్యను బాధపెట్టాడు. అతను శిక్ష అనుభవించి తీరాలి" అని గర్జించాడు.
మరుక్షణమే ఆ బ్రాహ్మణుడు "అయ్యా! నన్ను క్షమించు. నేనే సూర్యున్ని. దయ చూపుము" అని ప్రార్ధించాడు.
ఆ వెంటనే చెప్పులు, గొడుగూ సృష్టించి " ఇవిగో! ఈ పాదరక్షలు ధరించి, ఈ చత్రముతో శిరస్సుకు నీడపడితే నా వేడి సోకదు. ఇవి తల్లి రేణుకాదేవికి ఇవ్వండి" అని జమదగ్ని మహర్షికి సమర్పించుకున్నాడు.
అది చూసి జమదగ్ని శాంతించాడు. సూర్యుడు అంతర్ధానమయ్యాడు.
ఆ గొడుగును , చెప్పులనూ చూసి ప్రజలంతా కూడా సంతోషించారు. తాపసుల కోపం కూడా లోకకళ్యాణానికే దారితీస్తుందని రకరకాలుగా గొడుగులూ, చెప్పులనూ తయారు చేసి వినియోగించడం ప్రారంభించారు.
సూర్యుడి చేత సృష్టించబడినవి గనుక అవి పవిత్రమైనవి. వాటిని సజ్జనులకు, బీదసాదలకు, సాధువులకు దానం చేస్తే చాలా పుణ్యం. అవి చాలా పవిత్రమైనవి కావున పితృకార్యాలలో కూడ వినియోగిస్తారు.
Friday, February 10, 2012
చెప్పులూ, గొడుగూ... by... BHANDARU SRINIVASARAO
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment